120 కి.మీ. వేగంతో దూసుకెళ్తున్న నితిన్ గడ్కరీ కాన్వాయ్.. ఒక్కసారిగా అడ్డొచ్చిన గ్రామస్థులు.. తప్పిన పెను ప్రమాదం!

  • ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే పరిశీలనలో నితిన్ గడ్కరీ
  • మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో కాన్వాయ్‌కు ఎదురైన నిరసన
  • పంట పొలాల్లో నీటి నిల్వ సమస్యపై గ్రామస్థుల ఆందోళన
  • ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పోలీసులు
మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భద్రతలో ఒక పెద్ద లోపం వెలుగుచూసింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ముందుకు గ్రామస్థులు కొందరు అకస్మాత్తుగా రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణ పనులను పరిశీలించేందుకు మంత్రి తన కాన్వాయ్‌తో వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆ సమయంలో మంత్రి కాన్వాయ్‌లోని వాహనాలన్నీ గంటకు దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఆ ఎనిమిది లేన్ల రహదారిపై కాన్వాయ్ దూసుకుపోతుండగా, ముగ్గురు వ్యక్తులు ఒక్కసారిగా రోడ్డు మధ్యలోకి వచ్చి నిలబడ్డారు. వారి వెనుక మరికొందరు గ్రామస్థులు కూడా ఉన్నారు. 

అంతటి హైస్పీడ్‌లో వాహనాలు వెళ్తుండగా గ్రామస్థులు అకస్మాత్తుగా ముందుకు రావడంతో డ్రైవర్లు అప్రమత్తమై వాహనాలను నియంత్రించారు. దీంతో ఘోర ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఎక్స్‌ప్రెస్‌వే చుట్టుపక్కల నివసించే రత్లాం జిల్లా పరిధిలోని గ్రామస్థులే ఈ విధంగా కాన్వాయ్ ముందుకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రతిష్ఠాత్మక హైవే ప్రాజెక్టు వల్ల తమ పంట పొలాల్లోకి వర్షపు నీరు చేరి నీటి నిల్వ సమస్య తీవ్రంగా మారుతోందని, దీనివల్ల తాము నష్టపోతున్నామని గడ్కరీకి స్వయంగా వివరించేందుకు వారు ప్రయత్నించారు. 

అయితే, మంత్రి పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం ముందే కొన్ని ప్రాంతాల్లో అధికారులను మోహరించి, గ్రామస్థుల సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను సేకరించినప్పటికీ, కొందరు నేరుగా మంత్రిని కలవాలనే ఉద్దేశంతో ఇలా రోడ్డుపైకి వచ్చారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Nitin Gadkari
Delhi Mumbai Expressway
Ratlam security breach
Madhya Pradesh news
Convoy accident averted
Road Transport Ministry

More Telugu News